Brothers Dead in Metpally : ఒక కుటుంబంలో ఒకరు మరణిస్తే ఆ వియోగం వర్ణణాతీతం. ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటిది ఒకరోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందితే తట్టుకోవడం కష్టం. ఇక వారు చేతికందిన కుమారులైతే.. ఆ బాధను చెప్పేందుకు మాటలు చాలవు. అలాంటి విషాదమే జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది.
మెట్‌పల్లిలోని రెడ్డి కాలనీకి చెందిన బోగ నాగ భూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు. శనివారం మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు 30 ఏళ్ల బోగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పెద్ద కుమారుడు 32 ఏళ్ల బోగ సచిన్ శ్మశాన వాటికలోనే కుప్పకూలిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇప్పటికే తమ్ముడు శ్రీనివాస్ మృతితో విషాదంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని అన్న సచిన్ మరణం మరింత కుంగదీసింది. వార్త తెలిసినప్పటి నుంచి కుటుంబీకులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలో చేతికందిన ఇద్దరు కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోకసంద్రంలో కూరుకుపోయారు. తమ్ముడు బోగ శ్రీనివాస్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఏడాది వయస్సు దాటిన పాప ఉంది. అన్న సచిన్ కోరుట్ల కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఇంకా పిల్లలు కాలేదు.
ఇవీ చదవండి: