జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం ఎర్రవల్లికి చెందిన రైతు కొత్త కురువ వెంకటేష్(46), పూడూరు గ్రామానికి చెందిన తన చెల్లెలు శంకరమ్మ(43) మంగళవారం ఉండవల్లి మండలం కంచుపాడులో బంధువులు చేసిన జములమ్మ దేవరకు హాజరయ్యారు. మానవపాడు మండలం నారాయాణపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వీరన్న గద్వాల మండలం జమ్మిచేడు వద్ద బంధువుల ఇంట్లో జములమ్మ దేవరకు హాజరయ్యాడు. వెంకటేశ్, శంకరమ్మలు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా.. వీరన్న ద్విచక్రవాహనంపై నారాయణపురానికి బయలుదేరాడు.
ఇటిక్యాల మండలం వేముల శివారులో వీరన్న తన వాహనానికి పెట్రోలు పోయించేందుకు అపసవ్య దిశలో ప్రయాణించగా ప్రమాదవశాత్తు వెంకటేశ్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో అన్నా చెల్లితో పాటు వీరన్న తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం ముగ్గురినీ జాతీయ రహదారి సిబ్బంది అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. అప్పటికే అన్నా చెల్లెలు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వీరన్న పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు కుటుంబాలతో పాటు రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
- ఇదీ చూడండి: తూటా చప్పుడు లేని దండకారణ్యాన్ని చూస్తామా..?