Two died in warangal accident : బుధవారం రోజు వధువు ఇంటి వద్ద ధూంధాంగా పెళ్లి జరిగింది.. బంధువులంతా వివాహ వేడుకను ఉత్సాహంగా ఆస్వాదించారు. అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. వరంగల్ జిల్లాలోని ఇల్లందలో ఉన్న వరుడి ఇంటి వద్ద జరిగే రిషెప్షన్ కార్యక్రమాన్ని మరింత ఘనంగా జరపాలని బంధువులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. రంగురంగుల టెంట్లు వేశారు. వీధి పొడువుగా.. డెకరేషన్ చేశారు. విందు కోసం.. మాంసం సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున వచ్చే బంధువుల కోసం రకరకాల వంటకాలు చేసేందుకు సరంజామా రెడీ చేశారు. బంధువులంతా.. సంతోషంతో ఉన్నారు. వేడుకలో ఎలా ఎంజాయ్ చేయాలో.. ప్రణాళికలు వేసుకుంటూ.. ఉత్సాహంగా ఉన్నారు.
ఇదే క్రమంలో.. వేడుకకు వచ్చే బంధువుల్లో మాంసం తినని వారి కోసమని కూరగాయ వంటకాలు చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు అవసరమైన కూరగాయల లిస్టు రాశారు. వాటిని తీసుకొచ్చేందుకు.. వరుడి సోదరుడైన సుధాకర్, సోదరుని వరుసైన మరో యువకుడు జాఫర్ఘడ్ మండలం జీ తమ్మడపల్లికి చెందిన గణేశ్ కలిసి ద్విచక్రవాహనంపై వరంగల్‌కు వెళ్లారు. లిస్టులో ఉన్న అన్ని రకాల కూరగాయలను తీసుకుని తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఎంతో ఉత్సాహంగా బయల్దేరిన ఆ యువకులు.. ఇంటికి చేరలేదు.
ఖిల్లా వరంగల్ మండలం నాయుడు పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. బలంగా ఢీకొట్టుకోవటంతో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వాళ్లు కొని తెస్తున్న కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి.. వారి రక్తంతో తడిసిపోయాయి. ఇంటి దగ్గర ఎంతో సంతోషంగా ఉన్న బంధువులకు.. ఈ పిడుగులాంటి కాసేపటి తర్వాత తెలిసింది. ఇంకేముంది.. అప్పటి వరకు నవ్వులు పూసిన ఆ ఇంట.. రోధనలు ప్రతిధ్వనించాయి. ఇద్దరు యువకుల మృతితో పెళ్లింట తీరని విషాదం ఆవరించింది.