Boy died while giving Anesthesia at MGM Hospital : ప్రమాదంలో విరిగిన చేతికి శస్త్రచికిత్స కోసం 8 ఏళ్ల బాలుడికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మత్తు (అనస్తీషియా) ఇస్తుండగా.. అనూహ్యంగా మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు, లింగ్యాతండాకు చెందిన భూక్య శివ, లలిత దంపతుల చిన్న కుమారుడు నీహాన్(8)కు ఈ నెల 4న ప్రమాదంలో కుడి చెయ్యి విరిగింది. అదే రోజు ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం బాలుడికి శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు ఉదయం 10.30కు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ మత్తు ఇస్తుండగా బాలుడికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయిందని గుర్తించి, వెంటనే ఆర్‌ఐసీయూ వార్డులో చేర్చారు. అక్కడ కృత్రిమ శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
మధ్యాహ్నం 1.10 సమయంలో బాలుడు మృతి చెందినట్లు ప్రకటించారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకదశలో వైద్యులపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాలుడి మృతికి గల కారణాలపై విచారణకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీని వేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి ఎంజీఎం అధికారులను నివేదిక కోరారు.