వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో వాగులో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజులుగా బాలుడి కోసం అధికారులు, స్థానికులు గాలిస్తుండగా.. ఘటనా స్థలికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్ల పొదల్లో బాలుడి మృతదేహం కనిపించింది.
ఇదీ జరిగింది...
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సింగిడి దర్శన్‌రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఆదివారం ఒడి బియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వచ్చారు. సాయంత్రం నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్వేత, శ్వేత కుమారుడు ఇషాంత్, డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డి రావులపల్లికి కారులో బయలుదేరారు. తిమ్మాపూర్ సమీపంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా చిన్న వాగే కదా అని ముందుకు సాగారు. నీటి ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్ తెరిచుకుని కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.
అనంతరం గల్లంతైన వారికోసం గాలించగా... సోమవారం ఉదయం ప్రమాద ఘటనకు కిలోమీటరు దూరంలో కారు లభ్యమైంది. ఆ తర్వాత కాసేపటికి వధువు ప్రవళిక, వరుడి సోదరి శ్వేత మృతదేహాలు లభ్యమయ్యాయి. కాని శ్వేత కుమారుడు ఇషాంత్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ ఘటనలో కారు డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి ప్రమాదం నుంచి బయటపడి మరుసటి రోజు పోలీసులు ఎదుట లొంగి పోయాడు.
అప్పటి నుంచి కొనసాగిన గాలింపు
బాలుడి ఆచూకీ కోసం స్థానికులు, అధికారులు గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. మూడు రోజుల గాలింపు తర్వాత ఇవాళ ఘటనాస్థలికి మూడు కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో చిక్కుకుని ఉన్న బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
ఇదీ చూడండి: వాగులో కారు గల్లంతు... వధువుతో పాటు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం