త్వరలో రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దు చేయబోతోంది. మీ వద్ద నల్లధనం ఉంటే రాజమహేంద్రవరం రండి. అంతా ‘వైట్’గా మార్చేస్తాం’ అంటూ గత నెలలో వాట్సాప్‌లో సందేశం వచ్చింది. ఈ విషయాన్ని నిందితుల్లో ఒకరైన భాగ్యలక్ష్మి.. మిగిలిన వారికి చేరవేసింది. అరే.. అక్కడి వరకు వెళ్లడమెందుకు.. అదే దందాను ఇక్కడే.. మనమే చేసేద్దామంటూ రంగంలోకి దిగారు.
రెండ్రోజుల కిందట ఓ వ్యక్తిని బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. రెండో వ్యక్తికి టోకరా వేసే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు. కీసర ఠాణా పరిధిలో రూ.కోటి విలువైన నకిలీ నోట్లను మార్చేందుకు ప్రయత్నించి రాచకొండ పోలీసులకు చిక్కిన ముఠా కేసులో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకొచ్చాయి.
నకిలీ నోట్ల కోసం నిందితుల్లో ఒకరైన సుభాష్ చంద్రబోస్ యూసుఫ్‌గూడలోని ఓ ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులను కలిసారు. నల్లధనం’పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రకటనను రూపొందిస్తోందని వారిని నమ్మించాడు,ఆ ప్రకటనకు దర్శకుడు ఇతనే అంటూ ప్రధాన నిందితుడు అజీజ్‌ను పరిచయం చేశాడు. రూ.కోటి విలువైన నకిలీ నోట్లను ముద్రించేందుకు రూ.16,100కు బేరం కుదుర్చుకున్నారు.
ప్రింటింగ్ ప్రెస్ అతను ఆ నోట్లపై ‘షూటింగ్ పర్పస్’ అని ముద్రించి ఇవ్వడంతో నిందితులు కంగుతిన్నారు. ఆ పదాలు కనిపించకుండా చేసేందుకు ముప్పుతిప్పలు పడ్డారు. చివరకు.. బ్యాంక్ స్టాంప్‌లను నకిలీవి తయారు చేయించారు.
ప్రముఖ వ్యాపారి దగ్గర రూ.500 కోట్లు
ఉత్తర భారతదేశానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త వద్ద రూ.500 కోట్ల నల్లధనం ఉంది. ఒక్కడే.. అంత డబ్బును ‘వైట్’గా మార్చలేడు కాబట్టి మా సాయం కోరాడంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.2 కోట్లు మాత్రమే ఇవ్వాలంటూ ఆయన షరతు విధించాడని అందర్నీ బోల్తా కొట్టించారు.
చాలా మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులకు రూ.కోటికి సంబంధించిన(డబ్బుల కట్టలు) ఫొటోలు, వీడియోలు పంపించారు. ఇద్దరు మాత్రమే స్పందించినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇదీ చదవండి: