యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురం పరిధిలోని పెంచికల్ పహాడ్‌కు చెందిన చిన్నం సత్యనారాయణ, చిన్నం కృష్ణంరాజు దాయాదులు. 10 గుంటల వ్యవసాయ భూమి విషయంలో వారిద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. కృష్ణంరాజును హత్య చేస్తే ఆ భూమి తనకే వస్తుందని సత్యనారాయణ ఆశించాడు. భూ వివాదం విషయంలో గతంలో కేసు నమోదు అయ్యిందని భువనగిరి రూరల్ సీఐ జానయ్య వెల్లడించారు.
స్నేహితులతో కలిసి పథకం...
ఇదే విషయంలో సత్యనారాయణ తనకు పరిచయస్తులైన మోట కొండురుకు చెందిన... చిర్రబోయిన రాజయ్య, బోడ అబ్బసాయిలుతో కలిసి కృష్ణంరాజును హత్య చేయాలని పథకం వేశాడు. ఈనెల 25న ముగ్గురు కలిసి పెంచికల్ పహాడ్‌లోని వ్యవసాయ బావి వద్దకు ఆటోలో వెళ్ళారు. ఆ సమయంలో ఒంటరిగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కృష్ణంరాజును పథకం ప్రకారం ఆటోతో ఢీ కొట్టి గాయ పరిచారు.
గొడ్డలి, యాసిడ్‌తో దాడి...
అనంతరం వారితో తెచ్చుకున్న గొడ్డలి, యాసిడ్ బాటిల్‌తో కృష్ణంరాజుపై దాడి చేశారు. బాధితుని పై యాసిడ్ పడడంతో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆయనను పట్టుకునేందుకు వీరు ముగ్గురూ ఆటోలో వెంబడించినప్పటికీ దొరకలేదు. అప్పటి నుంచి సత్యనారాయణ, రాజయ్య, అబ్బసాయిలు పరారీలో ఉన్నారు.
నిందితులను ఆత్మకూరులో అదుపులోకి తీసుకున్నట్లు భువనగిరి రూరల్ సీఐ జానయ్య వెల్లడించారు. వారి నుంచి ఒక ఆటో, యాసిడ్ బాటిల్, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురి పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దిల్లీ ఘటనలో కుట్ర దాగి ఉంది : సురవరం