Chain snatcher arrested in Hyderabad: వేలల్లో జీతం వస్తున్న సరిపోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాడు. క్రికెట్ బెట్టింగ్ వలన భారీగా అప్పుల పాలైయ్యాడు. దీంతో వచ్చిన జీతం సరిపోక చైన్ దొంగతనం చేశాడు. చివరికి పోలీసులకి చిక్కాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం పాతపట్నంకు చెందిన సాపణ మనోజ్ కుమార్(22) ఎంబీఏ పూర్తి చేసి ప్రగతి నగర్లో ఓ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
వచ్చిన జీతంతో సంతృప్తి చెందకుండా ఇంక ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకోని క్రికెట్ బెట్టింగ్‌కి అలవాటు పడ్డాడు. దీంతో నిందితుడు దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. సుమారు 5 నుంచి 10 శాతం వడ్డీలకు డబ్బులను అప్పుగా తీసుకొనేవాడు. చేసిన అప్పులను తిరిగి తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలు ప్రారంభించాడు. గత నెల 31వ తేదీన మధ్యాహ్నం ఒకటి గంట ఆ సమయంలో నిజాంపేట కాలనీ శ్రీ బాలాజీ రెసిడెన్సిలోని 62 సంవత్సరాల వృద్ధురాలు స్థానిక సాయిబాబా ఆలయానికి వెళ్లి ఇంటికి వస్తుండగా దారిలో ఆమెతో మాటలు కలిపాడు. ఆమె వెంట ఇంటి వరకు వెళ్లి లిఫ్ట్ దగ్గర గొలుసు తెంచుకొని పారిపోయాడు.
ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈరోజు ఓ నగల దుకాణంలో నగలు అమ్మడానికి నిందితుడు వచ్చాడు. సమీపంలో బాచిపల్లి పోలీసులు ఉండడంతో అతనిపై అనుమానం వచ్చి పట్టుకున్నారు. వెంటనే నిందితుడ్ని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి ప్రశ్నించారు. విచారణలో నిందితుడి దగ్గర ఉన్న బంగారం ఆ వృద్దురాలిదే అని తేలింది. పోలీసులు మరింత లోతుగా విచారించగా మియాపూర్‌లో ఒక స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని దొంగతనం చేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
"బాచుపల్లి పరిదిలో నిజాంపేట శీనివాస్నగర్లో గత నెల 31న చైన్‌స్నాచింగ్ జరిగింది. 62 సంవత్సరాల ఒక వృద్దురాలు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెతో అద్దె ఇల్లు కావాలని మాటల్లో పెట్టి గొలుసు దొంగలించాడు. ఆరోజు మా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ రోజు నిందితుడ్ని పట్టుకున్నాం. అతడ్ని లోతుగా విచారిస్తే ఒక స్కూటీ కూడా దొంగలించాడని తెలిసింది. ఈ దొంగతనాలు సులభంగా డబ్బులు సంపాదించాలనే చేశాడు." - చంద్రశేఖర్, ఏసీపీ కూకట్పల్లి డివిజన్
ఇవీ చదవండి: