గ్రామ ఉప సర్పంచ్‌పై కత్తితో దాడి చేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో చోటు చేసుకుంది. ఓ పంచాయతీ విషయంలో మాట్లాడేందుకు వచ్చిన పెద్దమనుషులు ఈ దాడికి పాల్పడ్డారు. చెరువుగట్టు గ్రామానికి చెందిన జగదీశ్ తన బంధువులతో కలిసి ఉపసర్పంచ్ పొత్తి కడుపులో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన వెంకన్నను చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
పొడిచేడు గ్రామ ఉపసర్పంచ్ కప్పె వెంకన్న తమ్ముడైన చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం మరణించగా.. అతని భార్య పావని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. తమ్ముని కూతురును వెంకన్న తన వద్దే పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పావని తమ్ముడు తన మేనకోడలును తీసుకెళ్లడానికి పెద్ద మనుషులను తీసుకుని పొడిచేడు గ్రామానికి వచ్చాడు. మీ అక్క పావని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని.. నా తమ్ముని బిడ్డ నా వద్దే ఉంటుందని ఉప సర్పంచ్ వెంకన్న వారితో అన్నాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ క్రమంలో పంచాయతీకి వచ్చినవారిలో చెరువుగట్టు గ్రామానికి చెందిన జగదీశ్ తన బంధువులను పిలిపించి ఉపసర్పంచ్ వెంకన్నపై దాడి చేశారు. కత్తితో పొడిచిన వ్యక్తి పరారీలో ఉన్నాడని... వెంకన్న అన్న కప్పె శ్రీరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.