Attack On a social worker In Karimnagar: కరీంనగర్ శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని.. వాటిని కాపాడే దిశగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త మనోహర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రక్తపు మడుగులో ఉన్న మనోహర్‌ను స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రేకుర్తిలోని సమ్మక్క, సారలమ్మ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని.. వాటిని కాపాడాలని మనోహర్ వివిధ రూపాల్లో పోరాడుతున్నారు. ఇది సహించలేని 18 డివిజన్ కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణగౌడ్.. తనపై కక్ష పెంచుకొని దాడిచేయించాడని బాధితుడు ఆరోపించారు. ఆరుగురు వ్యక్తులు తనపై కర్రలతో దాడి చేసినట్టు మనోహర్ తెలిపారు. అటుగా ట్రాక్టర్‌పై వెళుతున్న కొందరు మనోహర్‌ను కాపాడి ఆసుపత్రికి తరలించారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించినట్లు సమాచారం.
2014 నుంచి పోరాటం: 2014 నుంచి మనోహర్ ప్రభుత్వ భూములను రక్షించే ధ్యేయంగా వందల వినతి పత్రాలు అధికారులకు అందజేశారు. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సాక్ష్యాల ఆధారంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది నచ్చని కొందరు రాజకీయ నాయకులు మనోహర్ పై కక్ష పెంచుకొని దాడికి పాల్పడినట్లు సమాచారం.
"కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 18 వ డివిజన్. నేను స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తాను. తరువాత ప్రభుత్వం భూములను కాపాడాలని 2014వ సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఇందువల్ల కొందరు నాపై కక్ష కట్టి.. గుర్తు తెలియని వ్యక్తులతో నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. కరీంనగర్ కొత్తపల్లి వద్ద నన్ను తలపై కొట్టారు. పోలీసులు నిందితులను గుర్తుపట్టారు. 18వ డివిజన్ కార్పొరేటర్ మాధవి భర్త కృష్ణగౌడ్ పైనే తనకు అనుమానం ఉంది. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి." - మనోహర్, సామాజిక కార్యకర్త
ఇవీ చదవండి: