మరో పది నిమిషాల్లో అమెరికా విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాల మేరకు.. తన కుమార్తె, కుమారుడిపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై జూబ్లీహిల్స్ ఠాణాలో జులై 24న కేసు నమోదైంది. ఈ ఘటనలో భర్తను జులై 25న అరెస్టు చేశారు. ఫిలింనగర్‌కు చెందిన భర్త స్నేహితుడైన రామచైతన్య(45) సైతం అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి రామచైతన్య పరారీలో ఉన్నాడు.
నిందితుడి కోసం గాలిస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు పక్కా సమాచారం అందడంతో దిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రామచైతన్యను దిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని ఇక్కడికి తరలించారు. అతన్ని కోర్టులో హాజరుపర్చగా గురువారం న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
అసలేమైంది...?
వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడైన ఎన్‌ఆర్‌ఐ(45) జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 70లో భార్య, కుమార్తె(14), కుమారుడు(11)తో కలిసి ఉంటున్నాడు. 2018లో ఏర్పడిన గొడవల నేపథ్యంలో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కొద్ది కాలంగా పిల్లలు ఇద్దరు దిగులుగా ఉండటంతో తల్లి వారిని ఒక సైకాలజిస్టు వద్ద కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు.
తండ్రి, అతడి స్నేహితుడు...
ఈ నేపథ్యంలోనే.. తండ్రి తమతో అయిదారేళ్ల కిందట అసభ్యంగా ప్రవర్తించారని, తండ్రితో పాటు అతడి స్నేహితుడు కూడా తమతో అసభ్యంగా ప్రవర్తించేవాడని వివరించారు. విషయం తెలుసుకున్న తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతడి స్నేహితుడు రామచైతన్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తండ్రిని రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న అతని స్నేహితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. తండ్రి పక్కనున్న సమయంలోనే అతడి స్నేహితుడు అసభ్యంగా ప్రవర్తించాడంటూ కుమార్తె గతంలోనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: father harassment: కన్న బిడ్డలతో అసభ్య ప్రవర్తన..
ఇదీ చూడండి: ఓ ఇంట్లో విందు... మూడు కుటుంబాల్లో విషాదం