బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన 8 మందిని ఏపీలోని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్) సిబ్బంది శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. హావ్‌డా - చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తున్న నలుగుర్ని రాజమహేంద్రవరంలోనూ, హావ్‌డా నుంచి రాష్ట్రానికి చేరుకుని అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మరో నలుగుర్ని విజయవాడలోనూ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నకిలీ ఆధార్, గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం
అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు బంగ్లాదేశీయులు పాస్‌పోర్టు, వారికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఎటువంటివీ చూపకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నలుగురూ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి వచ్చినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. వీరు బంగ్లాదేశ్ నుంచి హౌరా నుంచి గోవాకు వచ్చి గోవాలో దినసరి కూలీలుగా జీవిస్తున్నట్లు తెలిపారని విజయవాడ ఏసీపీ షానూ షేకు తెలిపారు.
2017 నుంచి 2019 వరకు గోవాలో ఉండి కోవిడ్-19 కారణంగా మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లారని పోలీసులు స్పష్టం చేశారు.. 2021 జూన్ 30న బంగ్లాదేశ్‌నుంచి గోవాకు బయలుదేరినట్లు విచారణలో తెలిపారని అన్నారు. బెంగళూరు అడ్రస్‌తో వీరినుంచి నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఉందని వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చామని... చొరబాటుదారులను కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.
ప్రయాణికులతో గొడవపడి....
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కోల్‌కతాలో రైలు ఎక్కిన బంగ్లాదేశీయులు శ్రీకాకుళం జిల్లా పలాస వరకూ మాత్రమే రిజర్వేషన్ చేయించుకున్నారు. అక్కడ దిగకుండా అవే సీట్లలో కూర్చున్నారు. పలాస నుంచి చెన్నై వెళ్లడానికి రిజర్వేషన్ చేయించుకున్నామని ఆ సీట్లు తమవని అడిగిన ప్రయాణికులతో ఘర్షణకు దిగారు. ప్రయాణికులు రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆర్‌పీఎఫ్ పోలీసులు విశాఖపట్నంలో రంగంలోకి దిగి వారిని ప్రశ్నించారు. వారు అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డారని నిర్ధరించుకుని రాజమహేంద్రవరంలో దించేశారు.
ఆర్‌పీఎఫ్‌కు పట్టుబడ్డ నలుగురిలో కరీంఖాన్ ఉత్తరప్రదేశ్ వాసి అంటూ నకిలీపత్రాలు సృష్టించుకున్నాడు. వాటితోనే తనతోపాటు షేక్ సద్దాం, మహ్మద్ అలీ అమీన్, మహ్మద్ షకాయత్ హుస్సేన్‌లకూ రిజర్వేషన్ చేయించుకున్నారు. మరోవైపు హావ్‌డా - వాస్కోడిగామా రైలులోని ఎస్2 బోగీలోని 10 నుంచి 14 నంబర్లున్న బెర్తుల్లో అక్రమ చొరబాటుదారులైన కొందరు బంగ్లాదేశీయులు ప్రయాణిస్తున్నారంటూ కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది విజయవాడలో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
మొత్తంగా 8 మంది బంగ్లాదేశీయులను ఆర్‌పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం ఆధారంగా వారి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఇటీవల బిహార్‌లోని దర్బంగా రైల్వేస్టేషన్‌లో పేలుడుకు రసాయన పదార్థాల్ని రైల్లోనే తీసుకెళ్లినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలిన నేపథ్యంలో తాజా ఘటనపైనా అప్రమత్తమయ్యారు.