Loan App Harassment: ఆన్‌లైన్ లోన్ యాప్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ వాటి ఆగడాలు మాత్రం ఆగటంలేదు. అడగకుండానే రుణాలు ఇచ్చి.. అనంతరం గడువుకు ముందే తిరిగి చెల్లించాలని లేదంటే.. పరువు తీస్తామని వేధించడంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వనపర్తి జిల్లాలో దీపావళి పండుగ రోజున ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు. రుణయాప్‌ల వేధింపుల కారణంగానే శేఖర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడు లోన్‌యాప్ ద్వారా 2 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. అందుకు గాను దాదాపు 30 వేల రూపాయల దాకా చెల్లించాడని చెప్పారు. అయినా లోన్ యాప్ నిర్వాహకులు వదల్లేదని.. మృతునికి సంబంధించిన మార్ఫింగ్ చేసిన ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపించారన్నారు. ఇది అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని వారు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: దూకుడు పెంచిన ఈడీ.. చిరుద్యోగుల ఖాతాల్లో భారీ లావాదేవీలు ఎలా?
'ఆ బిర్యానీ తింటే లైంగిక సామర్థ్యానికి దెబ్బ'.. హోటల్‌కు అధికారుల సీల్