Astrologer Fraud: అమాయకపు మహిళలను ఆసరాగా చేసుకుని గుప్తనిధుల పేరిట.. ఓ జ్యోతిష్కుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోధన్ మండలం ఏరాజ్పల్లిలో నెల క్రితం ఓ జ్యోతిష్కుడు జాతకం చెప్పడానికి వచ్చాడు.
ఊరిలో ఒక ఇంట్లో జాతకం చెబుతున్న అతడిని చూసి ఓ మహిళ అక్కడికి వెళ్లింది. ఆమెను చూసిన ఆ జ్యోతిష్కుడు నీకు బాధలున్నాయమ్మా జాతకం చెప్పాలి అనగానే గుడ్డిగా నమ్మిన ఆ మహిళ అతడిని ఇంటికి తీసుకెళ్లింది. జాతకం చెప్పిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే ఫోన్ చేయమని మొబైల్ నంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు.
కొన్ని రోజుల తర్వాత ఆ మహిళ ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతుంటే ఆ జ్యోతిష్కుడికి ఫోన్ చేసింది. దొరికిందే అదునుగా ఆ మోసగాడు మీ ఇంట్లో గుప్త నిధులున్నాయని మాయ మాటలు చెప్పాడు. వాటి కోసం పూజలు చేయాలని.. దానికి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. ఆ నిధులు దొరికితే కోటీశ్వరురాలు అవుతాము అనుకుందో ఏమో.. కట్టుకున్న భర్తకు కూడా తెలియకుండా ఆ మాయగాడికి సుమారు రూ.4 లక్షల రూపాయలు గూగుల్ పే చేసింది.
పూజలు చేశాక ఎన్ని రోజులకీ ఆ గుప్తనిధులు కనిపించలేదు. దాంతో జ్యోతిష్కుడికి ఫోన్ చేయగా కలవకపోవడంతో చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జ్యోతిష్కుడిగా వచ్చిన ఆ ఘరానా మోసగాడు సిరిసిల్లకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి:‘నిన్ను మర్చిపోవాలంటే.. నేను చచ్చిపోవాలి’