ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటలో తిమింగలం లాలాజలం విక్రయించే ముఠాను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యాంబర్ గ్రిస్ (తిమింగలం లాలాజలం) విక్రయంపై ఆన్ లైన్ లో గుట్టుచప్పుడు కాకుండా ఒక ముఠా బేరసారాలు నడుపుతోంది. యాంబర్ గ్రిస్కు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నందున.. దానిని సొమ్ముచేసుకునేందుకు అనైతిక వ్యాపారం నిర్వహిస్తున్న ముఠా కదలికలపై చెన్నైలోని అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ నేర నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు.
తామే కొనుగోలు చేస్తామని అటవీశాఖ అధికారులు ముఠాను నమ్మించి నరసరావుపేటకు వచ్చి వినుకొండ అటవీశాఖ, నరసరావుపేట రెండో పట్టణ పోలీసు అధికారులతో సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని పువ్వాడ ఆసుపత్రి సమీపంలో ముఠాను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 12 కోట్లు విలువ చేసే 8 కిలోల అంబర్ గ్రిస్ (తిమింగలం లాలాజలం)ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అటవీశాఖ అధికారులు ఆదివారం నరసరావుపేట కోర్టులో ప్రవేశ పెట్టగా న్యాయస్థానం వారికి రెండు వారాల రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి: KISHAN REDDY: 'కృష్ణా నీటి వినియోగంలో రాష్ట్రానిది అవగాహనా రాహిత్యం'