Adopted son killed Mother: ఈ నెల 7 తెల్లవారుజామున హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ పరిధిలోని న్యూ గడ్డిఅన్నారంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. హత్య చేయడానికి నిందితుడు ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని... అందులో భాగంగానే సమీపంలో ఉన్న సీసీ కెమెరాల తీగలను తెంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దురలవాట్ల బారిన పడిన కుమారుడే తల్లిని చంపి ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు.
కుమారుడి వివాహం కోసం: న్యూ గడ్డి అన్నారంలో నివసించే జంగయ్య యాదవ్, భూదేవి దంపతులకు సంతానం లేకపోవడంతో 1995లో సమీప బంధువు కుమారుడిని దత్తత తీసుకున్నారు. మూడు రోజుల వయసున్న పసికందును భూదేవి కంటికి రెప్పలా చూసుకొని పెంచి పెద్ద చేసింది. కుమారుడికి సాయితేజ అని పేరు పెట్టుకుని ఉన్నంతలో బాగా చదివించారు. ఇటీవల సాయితేజ వివాహానికి తండ్రి జంగయ్య సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఖర్చులు, కాబోయే కోడలి కోసం రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం ఇంట్లో సిద్ధంగా ఉంచాడు.
అంతా సవ్యంగా జరుగుతుందనే లోపల అనుకోని ఘటనలు ఆయనను కలవరపాటుకు గురిచేశాయి. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న దత్త కుమారుడు.. చెడు అలవాట్లకు బానిసయ్యాడని తెలిసి కుంగిపోయాడు. తీరు మార్చుకోవాలని పలుమార్లు నచ్చజెప్పినా సాయి తేజ వినలేదు. పెళ్లి చేస్తే మారతాడులే అనుకుని సర్ది చెప్పుకొన్నారు. కానీ కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచినందుకు ఇలా తన భార్య ఉసురు తీసుకుంటాడని ఊహించుకోలేకపోయారు.
స్నేహితులతో కలిసి పథకం: ఇంట్లో డబ్బులు, బంగారం ఉన్న విషయం తెలుసుకున్న సాయితేజ.. వ్యసనాల బారిన పడి ఎలాగైనా వాటిని కాజేయాలని చూశాడు. అందుకు స్నేహితుల మద్దతు కూడా తోడవడంతో పథకం వేశాడు. ప్రణాళిక ప్రకారం ముందుగా ఇంటి సమీపంలో సీసీ కెమెరాలను తెంచారు. శుక్రవారం రాత్రి తల్లి ఒక్కతే ఇంట్లో నిద్రిస్తుండగా, తండ్రి ఆరుబయట నిద్రిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన సాయితేజ.. తెల్లవారుజామున మూడుగంటల సమయంలో భూదేవి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని డబ్బు, బంగారంతో పరారయ్యాడు.
తెల్లవారాక ఇంట్లో భార్య విగతజీవిగా పడి ఉండటం చూసిన జంగయ్య.. మొదట గుండెపోటుతో చనిపోయిందని భావించారు. ఆ తర్వాత బీరువాలో నగదు, డబ్బు మాయమవడం, సాయి తేజ కూడా ఇంట్లో లేకపోవడంతో సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చుట్టు పక్కల సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో సాయితేజ చేతిలో బ్యాగు పట్టుకుని ఎల్బీనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో అతడే తల్లిని హత్య చేసి బంగారం, డబ్బు తీసుకెళ్లినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సాయితేజకు సహకరించిన వాళ్లెవరనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్త: అనుమానాస్పద స్థితిలో తల్లి మృతి.. బంగారం, డబ్బు కోసం దత్త పుత్రుడే చంపాడా.?
ఇవీ చదవండి: దేశద్రోహ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీంకు విన్నపం