రాజధాని నడిబొడ్డున రూ.10 వేల కోట్ల విలువైన సర్కారు భూమి అది. కొన్నేళ్ల కింద దానిపై ఓ వ్యక్తి కన్నేశాడు. అల్పాదాయ వర్గాల గృహ నిర్మాణ సంస్థ పేరుతో ఉన్న సొసైటీకి కలెక్టర్ ఈ భూమిలో కొంత భాగం కేటాయించారంటూ తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఆ భాగాన్ని ప్లాట్లుగా చేసి నోటరీపై పలువురికి విక్రయించాడు. కొనుగోలుదారులు టీఎస్ బీపాస్ ద్వారా ఇంటి నిర్మాణాలకు దరఖాస్తు చేసి, నిర్మాణాలకు పూనుకోవడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు మేల్కొన్నారు. సర్కారు భూమిలో ఇళ్లను నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, ఆ భూమి రక్షణకు చర్యలు చేపట్టారు.
గచ్చిబౌలి వద్ద నోకియా షోరూంకు సమీపంలో రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నంబరు 32 నుంచి 40 వరకు 99 ఎకరాల భూమి ఉంది. ఈ స్థలాన్ని కీలకమైన పరిశ్రమల ఏర్పాటుకు వినియోగించాలని గతంలోనే నిర్ణయించింది. ఏళ్లుగా ఇది ఖాళీగా ఉండటంతో ఓ వ్యక్తి కన్ను పడింది. కొన్నేళ్ల కిందటే ఇందులో 30 ఎకరాలను శ్రీరామలింగేశ్వర వీకర్ సెక్షన్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పట్టా ఇచ్చారంటూ కొన్ని పత్రాలను సృష్టించాడు. 70 నుంచి 500 గజాల ప్లాట్లుగా విభజించి కాగితం మీదే లేఅవుట్ చేయించాడు. అయిదారేళ్లుగా పలువురికి వాటిని విక్రయించడం ప్రారంభించాడు. కలెక్టర్ తమకు అనుమతిచ్చారంటూ ఆ పత్రాలతో నమ్మించాడు. రిజిస్ట్రేషన్లు లేవు కాబట్టి నోటరీ మీదే చాలావరకు అమ్మకాలు పూర్తి చేశాడు. ఈ విషయం రెండేళ్ల కిందట అధికారుల దృష్టికి రావడంతో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి పట్టా కింద సొసైటీకి భూమి ఇచ్చారంటూ చూపిస్తున్న పత్రాలన్నీ తప్పుడువని నిర్ధారించారు. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అప్పట్లో ఈ వ్యవహారాన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తెచ్చింది. తరువాత బెయిల్‌పై బయటకొచ్చిన అతను మళ్లీ ఆ స్థలంలో అమ్మకాలు చేపట్టినట్లు తెలిసింది.
వెలుగు చూసిందిలా
అతని వద్ద 70 గజాల లోపు స్థలాలను కొనుగోలు చేసిన వారిలో పలువురు టీఎస్ బీపాస్‌లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి కోసం పత్రాలను అప్‌లోడ్ చేశారు. తాజా నిబంధన ప్రకారం 70 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించాలనుకొంటే జీహెచ్‌ఎంసీ అనుమతి అవసరం లేదు. టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసి స్వీయ ధ్రువీకరణ పత్రం ఇచ్చి భవన నిర్మాణాన్ని మొదలుపెట్టొచ్చు. వందల సంఖ్యలో ఇలాంటి అర్జీలు వస్తుండడంతో అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని బల్దియా ఉన్నతాధికారులు సంబంధిత జోనల్ అధికారులను ఆదేశించారు. ఇటువంటి దరఖాస్తులతో ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టొద్దని, ఎవరైనా ప్రారంభిస్తే క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
తప్పుడు ధ్రువపత్రం ఇస్తే..
తప్పుడు ధ్రువపత్రం ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఇట్లాంటి నిర్మాణాలను ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూల్చే అధికారం బల్దియాకు ఉంది. గచ్చిబౌలిలోని సర్వే నంబరు 32 నుంచి 40 వరకు ఉన్న భూమి ప్రభుత్వానిదేనని కచ్చితమైన రికార్డులున్నాయి. ఓ వ్యక్తి ఆ భూమిలో కొంత తమదంటూ హైకోర్టును ఆశ్రయించగా, కాదని పేర్కొంటూ అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాం. అందువల్ల ఏ ఒక్కరూ అక్కడ ఇళ్ల నిర్మాణానికి పూనుకోవద్దు.
- టి.వెంకన్న, శేరిలింగంపల్లి ఉపకమిషనర్
ఇవీచూడండి: ప్రాజెక్టుల నిర్వహణా విధానంపై సర్కారు దృష్టి