అతడు సినిమాలో పోలీసులను తప్పించుకునేందుకు హీరో మహేశ్‌బాబు.. ఓ ఎత్తైన భవనంపై నుంచి దూకి తప్పించుకుంటాడు. ఈ సన్నివేశంలో హీరో మహేశ్‌బాబు ఓ తాడు సాయంతో దూరంగా ఉన్న ట్రైన్ మీదికి దూకుతాడు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రాణాలతో బయటపడతాడు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. కానీ.. ఇక్కడ మాత్రం మహేశ్‌బాబులా బతికి బయటపడలేకపోయాడు. ఐదంతస్తుల బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భవనం మీది నుంచి దూకి ఓ నిందితుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో ఆసిఫ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన కలీముద్దీన్ దుండిగల్‌కి చెందిన ఓ మహిళను దుబాయ్‌కి పంపిస్తానని నమ్మించాడు. ఆ మహిళ నుంచి లక్షా 30 వేలు వసూలు చేశాడు. తీరా డబ్బులు చేతికందాక.. ముఖం చాటేశాడు.
డబ్బులు తీసుకుని స్పందించకపోవడం వల్ల బాధిత మహిళ దుండిగల్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. కలీముద్దీన్ను విచారణకు హాజరు కావాలని సూచించారు. విచారణకు రాకపోవటం వల్ల నిందితున్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆసిఫ్‌నగర్‌లోని అతడి ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన కలీముద్దీన్.. ఎలాగైనా తప్పించుకోవాలని కంగారు పడ్డాడు. ఈ క్రమంలో ఐదో అంతస్తు నుంచి కిందికి దూకాడు.
తీవ్రంగా గాయపడిన కలీముద్దీన్ను కుటుంబసభ్యులు హుటాహుటినా.. మహావీర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
ఇదీ చూడండి: