కాసేపట్లో పెళ్లి.. వేడుకకు అంతా సిద్ధం చేసుకుని వధువును పెళ్లి మండపానికి తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు, బంధువులు బయలుదేరారు. వధువుతో కలిసి ఆటోలో వివాహ వేడుకకు వెళ్తున్నారు. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి నుంచి జారిపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వధువు ఆటో ముందు భాగంలో కూర్చున్నందున ఆమెకు ప్రమాదం తప్పింది. ఏపీలోని ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో ఈ ప్రమాదం జరిగింది.
సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువుకు వెళ్తుండగా ఆటోలో నుంచి వ్యక్తులు జారిపడ్డారు. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనతో ఆ పెళ్లింట విషాదం నెలకొంది. బంధువులంతా ఈ వార్త విని కుప్పకూలిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వధువు సహా కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. మృతులు కనకం కార్తీక్, అనిల్, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.
ఇదీ చూడండి: Software engineer dead: ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి