ACB Traps Sub Inspector: వీఆర్‌పై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఓ హోటల్ యాజమాని నుంచి భారీ మొత్తంలో లంచం ఆశించి అ.ని.శా. అధికారుల వలకు చిక్కారు.
ఏం జరిగిందంటే..
సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న లవకుమార్ వీఆర్‌పై వెళ్లాల్సి వచ్చింది. ఆయన శుక్రవారం రిలీవ్ అయ్యి హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. కానీ గురువారం అనూహ్యంగా ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
సూర్యాపేట మండల పరిధిలోని రాజుగారి తోట హోటల్ యాజమాన్యాన్ని నిబంధనలు పాటించడం లేదంటూ పలుమార్లు ఇబ్బందులకు గురి చేశారు. దాంతో విసుగెత్తిన యజమాని ఏలాగైనా ఎస్ఐకి బుద్ధి చెప్పాలనుకున్నారు. ఇదే అదునుగా భావించి ఏసీబీ వలకి దొరికేలా చేశారు. దాంతో గురువారం ఎస్ఐ లవకుమార్ అతని నుంచి రూ.1.30 లక్షలు లంచం తీసుకుంటూ అ.ని.శా. అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వీఆర్‌కు వెళ్తూ ఎస్ఐ అవినీతికి పాల్పడడటం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
రిలీవ్ అయిపోవాల్సిన ఎస్ఐ...
బాధితుడు రాజుగారి తోట హోటల్ యజమాని చెప్పిన దాని ప్రకారం.. గత కొన్ని రోజులుగా సదరు ఎస్ఐ లవకుమార్ హోటల్ యాజమాన్యాన్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. హోటల్ సజావుగా సాగాలంటే తనను ఆర్ధికంగా సంతృప్తి పరచాలని లక్షన్నర రూపాయలు డిమాండ్ చేశారు. తమ నుంచి ఎలాంటి సమస్య లేకున్నప్పటికి తమను ఇబ్బందులకు గురి చేసి లంచం అడుగుతున్నారని బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో గురువారం అ.ని.శా.కి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వీఆర్‌కు పోవాల్సిన ఎస్ఐ ఇలా ఏసీబీ వలలో చిక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి:Police Investigation on Boyaguda: ప్రమాదం ఎలా జరిగింది.. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు