అనిశా వలలో మరో తహశీల్దార్ చిక్కాడు. ఆయనతో పాటు అతడి కోసమే.. అతడి మార్గంలోనే నడుస్తోన్న మరో ఇద్దరు సిబ్బంది కూడా అనిశాకు అడ్డంగా దొరికిపోయారు. తీరా దొరికిపోయాక.. మా సార్ కోసమే పైసల్ తీసుకున్నామంటూ.. కథలు చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. భూమి రిజిస్టేషన్ పత్రాలు ఇచ్చేందుకు.. తహశీల్దార్ సయ్యద్ షౌకాత్ అలీ, వీఆర్ఏ కృష్ణ, కంప్యూటర్ ఆపరేటర్ శివ.. రైతు నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.
కుడికిల్ల గ్రామానికి చెందిన బండారు స్వామి నార్లాపూర్ శివారులో సర్వే నెంబర్.303లో తన అక్క పేరు మీద ఉన్న 5 ఎకరాల 20 గుంటలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. రిజిస్టేషన్ అయిన ఏడు డాక్యుమెంట్లకు ఒక్కొక్క దానికి రూ. 2500 ఇవ్వాలని తహశీల్దార్ డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని స్వామి.. బతిమిలాడాడు. చివరికి రూ.12000కు భేరం కుదిరింది.
ఇక బయటకు వచ్చిన స్వామి.. ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అనిశా అధికారులు.. పథకం ప్రకారం స్వామిని డబ్బులు తీసుకుని వెళ్లమని సూచించారు. ప్లాన్ ప్రకారం.. స్వామి నుంచి ఆపరేటర్ శివ, వీఆర్ఏ కృష్ణ.. 12 వేలు తీసుకుంటండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు పట్టుకుని ప్రశ్నించగా.. "మా సార్ కోసమే పైసల్ తీసుకున్నాం" అంటూ బుకాయించారు.
ఇంకెముంది.. ఈ తతంగం వెనుక ఉన్న తహశీల్దార్ షౌకత్ అలీతో పాటు ఆపరేటర్ శివ, వీఆర్ఏను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా.. తీసుకున్నా.. టోల్‌ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: