మేడ్చల్ జిల్లా మల్కాజిగిరికి చెందిన భూమిక విమల్(29).. బంజారాహిల్స్ రోడ్ నంబరు-12లో ఓ డిజైనర్ స్టోర్‌లో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె, 10.30 గంటల సమయంలో మెట్రో ఎక్కేందుకు యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్దకు వచ్చింది. మెట్రో రైలు అందుబాటులో లేకపోవడంతో స్టేషన్ కింద నిల్చుని క్యాబ్ బుక్‌చేస్తుండగా, అటుగా వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని శ్రీకృష్ణానగర్ వైపు పరుగుతీశాడు.
హఠాత్పరిణామంతో బిత్తరపోయిన యువతి, క్షణాల్లోనే తేరుకుని అతన్ని వెంబడించింది. వేగాన్ని అందుకునే క్రమంలో అటుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనదారుడి సాయం తీసుకుంది. సమీపంలోని సింధు టిఫిన్ సెంటర్ వీధిలో గోడకింద నక్కిన అతడిని స్థానికుల సాయంతో పట్టుకుంది. దేహశుద్ధి చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న నవీన్‌నాయక్(20)గా పోలీసులు గుర్తించారు. భూమిక ధైర్యసాహసాలను జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి అభినందించారు. ఆమె చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు.
ఇదీ చదవండి: గిరిజనులకు, తెరాస నేత కుమారుడికి మధ్య ఘర్షణ