women suicide: గ్రామ పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయతీలో జరిగిన అవమానాన్ని భరించలేక స్వాతి (42) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో జరిగింది.
అసలే జరిగిందంటే...: గౌరారం గ్రామానికి చెందిన స్వాతి, నాగేశ్వర్రావుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రాజేశ్వరికి ఇటీవలే వివాహం జరిగింది. అయితే రాజేశ్వరి కల్యాణ లక్ష్మి పథకం దరఖాస్తుపై గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకం కోసమని స్వాతి గ్రామ పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ వద్దకు వెళ్లింది. అదే సమయంలో మంగీలాల్.. స్వాతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామానికి చెందిన అరవింద్ అనే యువకుడికి సమాచారమిచ్చింది. తన పట్ల పంచాయతీ కార్యదర్శి వ్యవహరించిన తీరును గ్రామ సర్పంచికి ఫోన్ చేసి స్వాతి వివరించింది. ఆ సంభాషణలను అరవింద్ రికార్డు చేసి వాట్సాప్‌లో వైరల్ చేశాడు. తమ కుల సంఘంలోని పెద్దలకు, గ్రామంలోని పెద్దల వాట్సప్‌కు రికార్డింగ్స్‌ను పంపించాడు. అలా వాట్సాప్‌లో వైరల్ కావడంతో గ్రామ కార్యదర్శి మంగీలాల్ గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేశాడు.
మొన్న ఈ మధ్యనే నాకు మ్యారేజ్ అయింది. నిన్న సాయంత్రం మా అన్నయ్య ఫోన్ చేసి అమ్మ సూసైడ్ చేసుకుందని చెప్పాడు. ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు. మార్నింగ్ నేను అందరిని అడిగితే వాట్సాప్‌లో మేసేజ్‌లు చేయడం వల్ల జరిగిందన్నారు. మా అమ్మను మాత్రమే పంచాయతీకి పిలిచారు. మా అమ్మను అక్కడే మా అత్తయ్య కొట్టింది. భద్రమ్మ అనే ఆమె కూడా కొట్టిందంట. అంతమందిలో కొట్టడం వల్ల మా అమ్మ సూసైడ్ చేసుకుంది. - రాజేశ్వరి, మృతురాలి కుమార్తె
దీంతో గ్రామ సర్పంచ్ ఆదివారం పంచాయతీ నిర్వహించారు. అక్కడికి స్వాతి ,అరవింద్, అరవింద్ తల్లిదండ్రులు భద్రమ్మ, పుల్లయ్య, స్వాతి ఆడపడుచు సైదమ్మ కూడా వచ్చారు. ఈ క్రమంలోనే స్వాతి ఆడపడుచు సైదమ్మ, అరవింద్ తల్లి భద్రమ్మ స్వాతిని కొట్టడంతో పాటు నానా దుర్భాషలాడారు. ఈ సంఘటనను అవమానంగా భావించిన స్వాతి ఇంటికి వచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరుని ఫిర్యాదు మేరకు అరవింద్, భద్రమ్మ , పుల్లయ్య, సైదమ్మలపై కేసు నమోదు చేశామని బయ్యారం సీఐ బాలాజీ వెల్లడించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ మంగీలాల్‌పై విచారణ చేసి, అసభ్యంగా ప్రవర్తించాడని తేలితే అతడిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
మృతురాలి సోదరుడు ప్రవీణ్ మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్వాతి కుమార్తె కల్యాణలక్ష్మి పథకానికి సంతకం కోసం వెళ్తే పంచాయతీ కార్యదర్శి అసభ్యంగా మాట్లాడారని తెలిసింది. ఈ విషయం సర్పంచ్‌కు తెలియడంతో అందరి సమక్షంలో పంచాయతీ పెట్టారు. అక్కడకు వచ్చిన స్వాతిని అందరి సమక్షంలో ఇద్దరు మహిళలు కొట్టడంతో అవమానంగా భావించి బలవన్మరణం చేసుకుంది.- బాలాజీ, బయ్యారం సీఐ