Papidigudem Accident Today : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో ఓ కళాశాల బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని గీతం ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులను విజ్ఞాన యాత్రలో భాగంగా ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల పరిశీలనకు తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలోనే అశ్వారావుపేట మండలం పాపిడిగూడెం సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఘటనలో 19 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది విద్యార్థులతో పాటు మరో 11 మంది సిబ్బంది ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
పన్ను ఎగవేసే ప్రయత్నంలోనే..: తెలంగాణ ప్రాంతానికి చెందిన బస్సు విజ్ఞాన, విహార యాత్రలకు పక్క రాష్ట్రాలకు వెళ్లాలంటే రవాణా శాఖకు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుమును చెల్లించకుండా బస్సు యజమానులు విద్యార్థులను దొడ్డిదారిలో గమ్యానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి..