సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లి పరిధిలో తల్లీకూతురు అనుమానాస్పదంగా మృతిచెందిన కేసులో నిందితుడిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాజస్థాన్ హనుమానుడ్ జిల్లా నోహార్ గ్రామానికి చెందిన విజయ్ భారీటియా(41) రాణిగంజ్‌లోని ఓ సేఫ్టీ సామగ్రి డిస్ట్రిబ్యూటింగ్ దుకాణంలో ఏజెంటుగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య స్నేహ(40), కవలలు హన్సిక (15), వర్షిక(15), కుమారుడు వీరు(10) ఉన్నారు. పిల్లలు న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండటంతో విజయ్.. తన కుటుంబంతో కలిసి గత ఆరేళ్లుగా పాఠశాలకు సమీపంలోని మనోవికాస్ నగర్లో నివసిస్తున్నాడు. సేఫ్టీ సామగ్రి సరఫరా ఏజెంటుగా తొలుత ఆర్థికంగా బాగానే ఉన్న విజయ్ కుటుంబంలో.. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విషయమై మనోవేదనకు గురైన విజయ్.. భార్యాపిల్లలను హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తెల్లవారుజామున
ఈ క్రమంలో జూన్ 8న రాత్రి విజయ్.. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించాడు. విజయ్, స్నేహ, హన్సికలు ఓ గదిలో, వర్షిక, వీరు మరో గదిలో నిద్రపోయారు. ఇదే అదునుగా భావించిన నిందితుడు.. తెల్లవారుజామున నిద్రలేచి తొలుత హన్సికను గొంతు నులిమి, అనంతరం స్నేహ ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. మిగతా ఇద్దరు పిల్లలను హతమార్చడానికి ధైర్యం సరిపోకపోవడంతో స్వయంగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు.
అమ్మానాన్న నిద్రలేవడం లేదని
ప్రతి రోజు లేటుగా నిద్రలేచే అలవాటు ఉండటంతో.. ఉదయం 10 గంటలకు నిద్రలేచిన వర్షిక.. టీ తయారుచేసి తల్లిదండ్రులను నిద్రలేపేందుకు వెళ్లింది. వారు లేవకపోవడంతో వర్షిక.. రాజస్థాన్‌లోని తన తాతయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన కవాడిగూడలోని తన బంధువు రాకేశ్‌కు ఫోన్ చేశాడు. రాకేశ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని చూసేసరికి అప్పటికే స్నేహ, హన్సికలు మృతిచెందినట్లు గుర్తించాడు. విజయ్ కొనఊపిరితో ఉన్నట్లు గుర్తించిన రాకేశ్.. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించాడు.
విచారణలో
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హన్సిక మెడపై గాయాలు కావడాన్ని గుర్తించిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని భావించిన పోలీసులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయ్ను పలుమార్లు విచారించారు. శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించడంతో అతను నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చదవండి: CYBER ATTACK: బ్యాంక్ సర్వర్లోకి చొరబడి కోట్లు కొల్లగొట్టింది ఎందరు..?