జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పొరబాటున విషగుళికలతో చేసిన ఛాయ్ తాగి ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
రామచంద్రాపురానికి చెందిన 60ఏళ్ల అంజమ్మ రోజు మాదిరిగానే ఇంట్లో ఛాయ్ పెట్టింది. అందులో టీపొడికి బదులు పొరపాటున ఎండ్రిన్ వేసింది. అంజమ్మతోపాటు ఆమె భర్త మల్లయ్య, మరిది భిక్షపతి టీ తాగారు. 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.