అప్పటి వరకు కుమారుడితో కలిసి పొలం దున్నిన రైతు ఎడ్లను కడుగుదామని కుంటలోకి దిగి ప్రాణాలను పోగొట్టుకున్న విషాద ఘటన ఇది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. సత్తయ్య(54) తన కుమారుడు రమేశ్‌తో కలిసి పొలం దున్నారు. అనంతరం తండ్రి ఎడ్లను కడగటానికి పక్కనే ఉన్న కుంటలోకి వెళ్లారు. ఎడ్లు కుంటలోకి వెళ్తుండగా వాటిని కాపాడే ప్రయత్నంలో సత్తయ్య కూడా కుంటలోకి దిగగా.. ప్రమాదవశాత్తు జారిపడి ఈత రాకపోవడంతో మునిగిపోయారు.
ఎంతకూ రాకపోవడంతో కుంట దగ్గరకు వెళ్లిన రమేశ్ తండ్రి ముగినిపోవడాన్ని గమనించాడు. తనకూ ఈత రాకపోవడంతో చుట్టుపక్కల రైతులను పిలిచినా వారొచ్చే లోగానే సత్తయ్య మృతి చెందారు. కళ్ల ముందే తండ్రి చనిపోవడంతో రమేశ్ రోదనలు మిన్నంటాయి. నాన్నా.. నిన్ను కాపాడుకోలేకపోయానే..! అంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. రెండు రోజుల కిందట వారి పశువు విద్యుదాఘాతంతో చనిపోగా.. ఆ ఘటన మరవక ముందే ఇంటి యజమాని మృతి చెందటంతో విషాదం నెలకొంది. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఇవీ చూడండి..
71 లక్షల ఎకరాల్లో పంటల సాగు.. వ్యవసాయశాఖ తాజా నివేదిక
'డైరెక్టర్లకు భాష కూడా తెలీదు.. అందుకే బాలీవుడ్లో ఫ్లాప్స్'