Person Suicide in Hospital: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహబూబ్పల్లి గ్రామానికి చెందిన మర్రి బాపు(50)ది ఓ విషాద కథ. తనకున్న కొద్ది భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో ఆ ఊరు మొత్తం తుడుచుకుపోయింది. అందుకు బదులుగా భూనిర్వాసితులకు ప్రభుత్వం పునరావాసంతో పాటు ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఆ ఉద్యోగాలను పొందిన వారిలో మర్రి బాపు కుటుంబం లేదు. దీంతో మనస్తాపానికి గురైన బాపు.. ఉద్యోగం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇవాళ, రేపు అంటూ అధికారులు కాలయాపన చేశారు. ఫలితం లేకపోవడంతో బాధితుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 1న కేటీపీపీ ప్రధాన గేటు ముందు బాపు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతనిని స్థానికంగా ఉన్న స్మార్ట్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. విధి నిర్వహణలో భాగంగా వైద్యులు బాధితుడికి చికిత్స అందిస్తూనే ఉన్నారు. అలా పదిరోజులు గడిచాయి. బాపు ఆరోగ్యం కుదుటపడింది. ఇక డిశ్చార్జి సమయం దగ్గరపడింది. ఇక ఇక్కడే అసలు కథ మొదలైంది..
ఆస్పత్రి వైద్యులు.. బాపుకి ఇంతవరకూ చికిత్స అయిన బిల్లు రూ. 60 వేలు అయినట్లు తెలిపారు. అవి చెల్లిస్తేనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వాలి. అందుకోసం కుటుంబీకులకు సమాచారం అందించారు. కానీ బిల్లు కట్టడానికి ఇంటి నుంచి ఎవరూ రాలేదు. దీంతో బాపు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అటు భూమి తీసుకున్న కేటీపీపీ యాజమాన్యం, ఇటు తన వాళ్లనుకున్న కుటుంబీకులు కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనోవేదన చెందారు. చికిత్స అందించి తనను బతికించిన ఆస్పత్రిలోనే ప్రాణాలు తీసుకున్నాడు. వార్డులో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
ఇవీ చదవండి: Hyderabad Pub Case: పుడింగ్ పబ్ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు