Mother killed son: మాతృమూర్తికి భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందంటారు. కానీ కన్న కుమారుడి ఆగడాలు భరించలేక, ఓ తల్లికి సహనం చచ్చిపోయింది. ప్రమాదంలో కాళ్లు విరిగి మంచాన పడినా.. తనకు రోజు మద్యం, మాంసం తేవాలన్న వేధింపులను తట్టుకోలేక.. ఆ తల్లి, కుమారుడ్ని చంపేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా, డెంకాడ మండలంలో చోటుచేసుకుంది.
డెంకాడ మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ భర్త మూడేళ్ల కిందట చనిపోయారు. కుమార్తె సునీత, కుమారుడు సాయితో కలిసి పూసపాటిరేగ మండలం గుండపురెడ్డిపాలెంలో ఉంటున్నారు. స్థానికంగా ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగిపోయి మంచానికే పరిమితమయ్యాడు. అంతకుముందే చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లోనూ మద్యం తాగేవాడు.
రోజూ మాంసం వండాలని, మద్యం తీసుకురావాలని తల్లిని, అక్కను వేధించి కొట్టేవాడు. కుమారుడి ఆగడాలను భరించలేక రామాయమ్మ శుక్రవారం రాత్రి సాయి (20)కి అన్నంలో పురుగుమందు కలిపి వడ్డించారు. అది తిన్న సాయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లే అంబులెన్సుకు సమాచారం ఇచ్చి ఆసుపత్రికి తరలించారు. జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి శనివారం చనిపోయాడు. ఈ మృతిపై సోదరి సునీత అనుమానాలు వ్యక్తం చేశారు. తల్లిని విచారించగా.. వేధింపులు తట్టుకోలేక విసిగిపోయి అన్నంలో పురుగుమందును కలిపినట్లు అంగీకరించారు.
ఇవీ చదవండి: