దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలను తయారుచేసి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో 11మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి.. పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
నిందితులు కోట కిషోర్ కుమార్, వెంకటేశ్వర్‌రావు, కిరణ్ కుమార్, కృష్ణకాంత్ రెడ్డి మరికొంత మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారని సీపీ చెప్పారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్ ఘోష్, సంజయ్ వర్మ, ప్రతిమ పాటిల్‌తో పరిచయం పెంచుకొని వారి ద్వారా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయించి.. అవసరమైన వారికి రూ.90 వేల నుంచి రూ.2.5లక్షల వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ చెందిన ఓ యువకుడికి డిగ్రీ సర్టిఫికెట్ అవసరమై ముఠాను సంప్రదించాడని సీపీ చెప్పారు. ఇందు కోసం ప్రధాన నిందితుడు కిషోర్ కుమార్‌కు వెంకటేశ్వర్‌రావు ద్వారా రూ.90 వేలు చెల్లించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు యువకుడిని విచారించంగా ముఠా గుట్టురట్టయిందని తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున నకిలీ ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పటి వరకు 150 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్టు సీపీ తెలిపారు.
నిందితుల వద్ద నుంచి దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలకు చెందిన సర్టిఫికెట్లతో పాటు 13 రాష్ట్రాలకు చెందిన పదవ తరగతి, ఇంటర్ బోర్డులకు చెందిన సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. వీటితో పాటు టీసీలు, సిఫార్సు లేఖలు, ఏటీఎం, ఆధార్ కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు.
"11మంది అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నాం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన నకిలీ ధ్రువపత్రాలను అమ్ముతున్నారు. వెంకేటేశ్వరరావు అనే వ్యక్తి సర్టిఫికెట్ కోసం తనకు తెలిసిన కృష్ణకాంత్ రెడ్డిని సంప్రదించాడు. అతను మధ్యవర్తి అయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాహుల్ ఘోష్ ద్వారా బీకాం సర్టిఫికెట్‌ని పోస్ట్ ద్వారా కోటకిశోర్కు పంపించాడు" - స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ సీపీ
ఇవీ చదవండి: క్యాసినో వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేల పాత్రపై అధికారుల ఆరా..!
'కట్నం కోసం భార్యపై గ్యాంగ్ రేప్.. లిఫ్ట్‌లో ఉండగానే ముమ్మారు తలాక్!'