భర్తతో గొడవపడిన ఓ యువతి పుట్టింటికి చేరగా.. ఇదే అదనుగా ఓ నయవంచకుడు ఆమెను చెరబట్టి చిత్రహింసలకు గురి చేసి వ్యభిచార కూపంలోకి దించాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో వెలుగు చూసింది. బాధితురాలి కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలానికి చెందిన యువతి (21)కి గార్ల మండలానికి చెందిన వ్యక్తితో మూడేళ్ల కిందట పెళ్లయింది. వారికి రెండేళ్ల కుమార్తె ఉంది. కూలి పనులు చేసుకుని బతికేవారు. ఎనిమిది నెలల కిందట దంపతుల మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఆమె కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది.
ఈ విషయం తెలిసి అదే గ్రామానికి చెందిన భూక్యా సర్వేశ్ మార్చి నెలలో ఆ యువతి పుట్టింటికి వెళ్లి.. ‘నీ భర్త రమ్మంటున్నాడు’ అంటూ మాయమాటలు చెప్పాడు. భర్త పిలిచాడనగానే ఆమె ఆశపడింది. అప్పటికే సర్వేశ్‌తో పరిచయం ఉండటం, సోదరుడిగా భావించి పలుమార్లు రాఖీ కట్టడంతో కుమార్తెను తీసుకుని అతడి వెంట హైదరాబాద్ బయలుదేరింది. ఆమెను దిల్‌సుఖ్‌నగర్‌లోని తన గదికి తీసుకువెళ్లాడు. రెండురోజులైనా భర్త కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా.. సర్వేశ్ వికృతరూపం బయటపడింది. ఆమె దగ్గరున్న 5 తులాల నగలను లాక్కున్నాడు. తీవ్రంగా కొట్టి సిగరెట్‌తో కాల్చి వాతలు పెట్టాడు. ఆమె రెండేళ్ల కుమార్తె వీపుపైనా సిగరెట్లతో కాల్చి తీవ్రంగా హింసించాడు. తన మాట వినకుంటే పాపను చంపేస్తానని బెదిరించాడు. మత్తుమందు ఇచ్చి ఆమెతో వ్యభిచారం చేయించాడు.
రోజూ నలుగురైదుగురిని తీసుకువచ్చేవాడు. ఓ రోజు ఇంటి యజమానికి అనుమానం వచ్చి సర్వేశ్ లేని సమయంలో గది తాళం పగలగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చి వివరాలు ఆరా తీశాడు. ఆమె ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. వెంటనే ఆయన కొంత సొమ్ము చేతిలో పెట్టి ఇంటికి వెళ్లిపోమని పంపేశారు. ఎలాగోలా పుట్టింటికి చేరిన బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారు బుధవారం గార్ల మండలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: తేలిగ్గా తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: హైకోర్టు