ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు మద్యం సరఫరా చేసే ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్ డిపోలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతం వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్ల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉదయం 8.30 గంటల సమయంలో డిపోలో పొగలు రావడాన్ని సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు గమనించారు. వెంటనే డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. స్పందించిన ఆయన అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకొనే లోపే మంటలు తీవ్రమయ్యాయి.
అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ తన సిబ్బందితో ఘటన స్థలికి చేరుకున్నారు. సమీపాన ఉన్న ఆదిలాబాద్, ఇచ్చోడా, జన్నారం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడ నుంచి సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అగ్నిప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని డిపో కార్మికులు ఆరోపిస్తున్నారు. ఐఎంఎల్ డిపోలో విద్యుత్ సంబంధిత మరమ్మతులు చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఎంఎల్ డిపోలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ ఘటనా స్థలికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీచూడండి: Facebook friendship: ఫేస్బుక్ పరిచయం ప్రేమగా మారింది.. యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది.!