Father beats son brutally in Hyderabad:మద్యం మత్తులో ఓ కన్న తండ్రి కుమారుడికి నరకం చూపించాడు. అల్లరి చేస్తున్నాడనే నెపంతో కర్కశంగా ప్రవర్తించాడు. ఎనిమిదేళ్ల పిల్లాడిని కర్రతో చితకబాదాడు. 'నాన్నా కొట్టొద్దు.. ప్లీజ్ నాన్నా కొట్టొద్దు.. నేను అల్లరి చేయను' అని ప్రాధేయపడినా... గుక్కపట్టి ఏడుస్తున్నా.. కనికరం చూపలేదు. కొడుతున్న దృశ్యాలను కుమార్తె చేత వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందాడు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్లోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బోరున విలపిస్తున్నా.. కర్ర విరిగిపోయినా..
హైదరాబాద్ లాల్ దర్జాజ ప్రాంతంలో అశోక్, జిజాబాయి దంపతులు నివాసం ఉంటున్నారు. జిజాబాయి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా.. అశోక్ మద్యానికి బానిసయ్యాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అల్లరి చేస్తున్నాడని.. ఇరుగుపొరుగువారు తండ్రికి ఫిర్యాదు చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి.. ఆగ్రహానికి గురై ఎనిమిదేళ్ల తన కుమారుడిని చితకబాదాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో పసివాడిని కర్రతో దారుణంగా కొట్టాడు. అతడు కొట్టే ధాటికి కర్రే విరిగిపోయిందంటే.. ఇక ఆ పిల్లాడు ఎంత వేదన అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు.
ఆ బాలుడిని కొట్టడమే గాక.. ఆ కర్కశ తండ్రి తాను తన కుమారుడిని కొడుతున్న వీడియో తీయమని బాలుడి చెల్లెలికి చెప్పాడు. ఆ చిన్నారి తన అన్నను నాన్న కొట్టడం చూసి ఎంతో భయపడింది. అప్పటికే భయంతో వణికిపోతున్న ఆ పసిదాన్ని వీడియో తీయమని తండ్రి బెదిరించడంతో ఇంకా బెదిరిపోయింది. తీయకపోతే తననెక్కడ కొడతాడో అని వణికిపోయింది. తన అన్నను తండ్రి కొట్టడం చూస్తూ.. ఓవైపు ఏడుస్తూ.. మరోవైపు.. అన్నయ్యను కొట్టొద్దు నాన్నా అంటూ.. ఆ పాప వీడియో తీసింది.
తల్లడిల్లిపోయిన తల్లి..
Father Brutally Beats Son video: కాసేపయ్యాక ఇంటికొచ్చిన తల్లి కుమారుడిని తన భర్త కొడుతుండటం చూసి తల్లడిల్లిపోయింది. ఆ బాలుడి ఒంటిపై దెబ్బలు చూసి గుండె పగిలేలా ఏడ్చింది. తను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కొడుకుపై కర్కశంగా దాష్టీకానికి పాల్పడిన భర్తపై కన్నెర్ర చేసింది. ముందుగా ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. అనంతరం తన కుమారుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన భర్తపై ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. అతణ్ని అరెస్ట్ చేశారు.
కుమారుడిని కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం మత్తులో తండ్రి పాశవిక ప్రవర్తనను పలువురు ఖండిస్తున్నారు. ఆటవికంగా ప్రవర్తించిన తండ్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
'ఎనిమిదేళ్ల బాలుడు బాగా అల్లరి చేస్తున్నారని... తండ్రికి ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేశారు. ఆ కోపంతో బాలుడిని కర్రతో కొట్టాడు. బాలుడి తల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.'
-అబ్ధుల్ ఖాదర్ జిలాని, ఛత్రినాక సీఐ
ఇదీ చూడండి : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొదని బెదిరింపు