Jagtial Murders Case : జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్, కందుల రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై కేసు నమోదయింది. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. జగిత్యాలలో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్త్ చేపట్టారు. టీఆర్‌నగర్‌లో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
అసలేం జరిగిందంటే..
Jagtial Murders Case Update : జగన్నాథం నాగేశ్వర్‌రావు(60) ఎరుకలవాడలో ఉంటారు. కుమారుల కుటుంబాలు కూడా సమీపంలోనే ఉంటాయి. ఆరు నెలలకోసారి స్థానికంగా కులసంఘం సమావేశం ఉండటంతో గురువారం ఆయనతోపాటు పెద్దకొడుకు రాంబాబు(35), రెండో కుమారుడు రమేశ్(25), మూడో కుమారుడు రాజేశ్ వెళ్లారు. అక్కడే మహిళలు వేరేగా సమావేశం నిర్వహించుకుంటున్నారు. నాగేశ్వర్‌రావు, ఆయన కుమారుల కుటుంబాలకు చెందిన మహిళలు కూడా దానికి హాజరయ్యారు. అప్పటికే కుల సంఘం సమావేశంలో కాచుకు కూర్చున్న వైరి వర్గం.. వారి కళ్లెదుటే నాగేశ్వర్‌రావు.. ఆయన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఇద్దరు రక్తపు మడుగులో అచేతనంగా పడిపోగా మరొకరు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోతూ కనిపించడం చూసి గుండెలవిసేలా రోదించారు. నాగేశ్వర్‌రావు, రాంబాబులను ఛాతి, గొంతు భాగంలో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రాజేశ్ దాడి నుంచి తప్పించుకుని పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరుగురికిపైగా వ్యక్తులు ఈ దారుణంలో భాగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.