ప్రమాదవశాత్తు చెరువులో మునిగి అన్నిత్ (2) అనే బాలుడు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారామపురం గ్రామంలో జరిగింది. పిల్లలు నీటిలో మునిగిన విషయాన్ని గమనించిన గ్రామస్తులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే బాలుడు మృతి చెందాడు.
జిల్లాలోని సీతారామపురం గ్రామానికి చెందిన బోడిగె సతీశ్, మానస దంపతుల కుమారుడైన అన్నిత్ తన అక్క లక్కీ, మేనత్త కూతురు నందినితో కలిసి ఇంటి సమీపంలోని చెరువులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోప్రమాదవశాత్తు గత సంవత్సరం మిషన్ కాకతీయలో భాగంగా తీసిన గుంతలో పడి నీటిలో మునిగిపోయారు. పిల్లలు నీటిలో పడిన విషయాన్ని అటుగా వెళ్తోన్న గ్రామస్తులు గమనించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా.. అప్పటికే అన్నిత్ మృతి చెందాడు. బాలుడు మరణించిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
ఇదీ చదవండి: మట్టిమిద్దె కూలి... సర్పంచ్ లక్ష్మమ్మ, ఆమె మనవడు మృతి