Bank Employee Fraud: జగిత్యాల జిల్లా గొల్లపల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బొమ్మ అంజయ్య 15ఏళ్లుగా బిజినెస్ కరస్పాండెట్‌గా పనిచేస్తున్నాడు. ఖాతాదారులతో నమ్మకంగా ఉంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా కొట్టేశాడు. కొందరి పేరిట వారికి తెలియకుండానే రుణాలను తీసుకున్నాడు. శ్రీరాములపల్లి, ఇబ్రహీంనగర్, బీబీరాజ్‌పల్లికి చెందిన రైతులు, మహిళా సంఘాల సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి.. ఖాతాల నుంచి డబ్బులు దోచేయడం కలకలం రేపుతోంది. పంటరుణాలు రెన్యూవల్ చేయిస్తానని డబ్బులు తీసుకుని కట్టలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కొన్నాళ్లుగా సాగుతున్న మోసం ఈ మధ్యే వెలుగుచూసింది. దీంతో బాధితులు న్యాయం చేయాలంటూ మూడ్రోజులక్రితం బ్యాంకు ముందు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఖాతాల్లో సొమ్ము మాయం కావడంలో అంజయ్యతోపాటు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి దాచుకున్న డబ్బులు, పిల్లల వివాహాల కోసం ఉంచిన సొమ్మంతా పోవడంతో.. బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఘటనపై యూనియన్ బ్యాంక్ సహా ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
"చాలా మంది బాధితుల ఖాతాల నుంచి అంజయ్య డబ్బులు మాయం చేశాడు. ఖాతాదారులు లేకుండా డబ్బులు డ్రా చేశాడు. బ్యాంకు వారిని అడిగితే మీరే సంతకం పెట్టారని అంటున్నారు. మాకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో మోసం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం." -బాధితులు
ఇవీ చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన బాల్యవివాహం... గర్భం దాల్చడంతో శిశువు సహా బాలిక మృతి
అమిత్ షా టూర్లో కలకలం.. ఆంధ్రా ఎంపీ పీఏ అంటూ హల్చల్.. చివరకు...