మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో విషాదం చోటుచేసుకుంది. దాహం తీర్చుకునేందుకు వాగులోకి దిగి.. 8 పాడి గేదెలు మృత్యువాతపడ్డాయి.
గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పాడి గేదెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పశువులను రోజూ మేతకు ఊరి చివరన అడవిలోకి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం మేతకు వెళ్లిన గేదెలు నీటి కోసం పక్కనే ఉన్న పెద్దకట్టువాగులోకి దిగాయి.
వాగులో నుంచి పంట పొలాలకు విద్యుత్ మోటార్లు బిగించడంతో.. పశువులు విద్యుదాఘాతానికి గురయ్యాయి. 8 గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. తమకు జీవనాధారమైన బర్రెలు తమ కళ్ల ముందే చనిపోవడం చూసి మహిళలు బోరున విలపించారు. పరిహారం చెల్లించి.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.