Hyderabad Chain Snatching: హైదరాబాద్ మహానగర పరిధిలో గొలుసు దొంగలు హల్‌చల్ చేశారు. నగరంలో కొన్ని నెలలుగా గొలుసు దొంగతనం కేసులు తగ్గిపోగా... ఒకేరోజున దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ జిల్లా... పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో గంట వ్యవధిలో ఇద్దరు మహిళల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ కూరగాయల దుకాణానికి వెళ్లగా స్కూటీపై వచ్చిన దొంగ ఆమె మెడలోనుంచి 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. జీడిమెట్లలో వరలక్ష్మి అనే మహిళ మెడలోనుంచి 4 తులాల బంగారు గొలుసును దుండగుడు చోరీ చేశాడు. భాగ్యలక్ష్మి కాలనీలో ఉమారాణి అనే మహిళ మెడలోనుంచి గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించగా కేకలు వేయడంతో వదిలేసి దుండగుడు పరారయ్యాడు.
ద్విచక్రవాహనంపై వచ్చి..
సికింద్రాబాద్ ఉత్తర మండల పరిధిలో మారేడుపల్లి, తుకారం గేట్ పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. మారేడుపల్లి పీఎస్ పరిధిలోని ఇందిరా రైల్వే కాలనీ వద్ద ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగుడు... విజయ అనే మహిళ ఇంటికి వెళ్తున్న క్రమంలో మెడలో నుంచి ఐదు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. తుకారం గేట్ పీఎస్ పరిధిలోని రియో పాయింట్ వద్ద రాంబాయి అనే వృద్ధురాలు మెడలోంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు రెండున్నర తులాల బంగారు ఆభరణాన్ని అపహరించాడు.
ఒక్కడేనా?
వరుస గొలుసు చోరీల ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. పేట్‌బషీరాబాద్, తుకారాంగేట్, మారేడ్‌పల్లిల్లో గొలుసు చోరీలు చేసింది... ఒక్కడేనని నిర్ధారించారు. నిందితుడి కోసం టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడి ఆనవాళ్లు, బైకు ఫొటో ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలోని పీఎస్‌లకు ఫొటోలు పంపించారు.
ఇదీ చదవండి : ఆసక్తి రేపుతోన్న 'గుంత'.. ఎంత తవ్వినా బయటపడని 'రహస్యం'..