వ్యవసాయం కలిసి రాలేదు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతూనే ఉన్నాయి. వీటికి తోడు కుమార్తె వివాహనికి తెచ్చిన రుణం గుదిబండలా మారింది. అప్పుల వాళ్ల మాటలు సూదుల్లా గుచ్చుకున్నాయి. పరువు కోసం పాకులాడే ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం... ఇజ్జత్ కీ సవాల్ అంటూ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పది లక్షలుంటే తమ ప్రాణాలు నిలిచేవన్న వారి ఆవేదన కంటతడి పెట్టించింది.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కేపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన రమేశ్... పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెట్టుబడితో పాటు కుమార్తె వివాహం కోసం తెచ్చిన రుణాలు 8 లక్షలకు చేరుకున్నాయి. వాటిని తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది 30 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. దిగుబడి వచ్చిన అనంతరం అప్పులు తీర్చి కుటుంబంతో హాయిగా గడపాలి అనుకున్నాడు. కానీ... కాలం అతడిని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. ఆశించిన స్థాయిలో దిగుబడి రాక.... తెచ్చి అప్పులు తీర్చలేక... తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 'ఇజ్జత్ కీ సవాల‌్' అని సూసైడ్ రాసి కుటుంబంతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
"ఇటీవల 30 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాను. వంద క్వింటాళ్ల దిగుబడి మాత్రమే రావటం వల్ల తీవ్రంగా నష్టపోయాను. కౌలు డబ్బులతో పాటు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయల అప్పు ఉంది. రూ.10 లక్షలు చేతిలో ఉంటే ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చేది కాదు. అప్పుల బాధతో... ఏం చేయాలో తోచక ఆత్మహత్య చేసుకుంటున్నాం" అంటూ ఘటనా స్థలిలో దొరికిన సూసైడ్ నోట్లో రమేశ్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం యథావిథిగా రమేశ్ పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగిన వచ్చిన అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలకొట్టి చూడగా... దంపతులిద్దరూ ఉరేసుకొని కనిపించారు. కుమారుడు, కుమార్తె మరో గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలాన్ని బెల్లంపల్లి డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అప్పులు తీరవనే బాధతో చనిపోయినట్లు వెల్లడించారు.
కుమార్తెకు ఏడాది క్రితం రాపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. సుమారు 6 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా చేశారు. మూడు రోజుల క్రితం కుమార్తె పుట్టింటికి రాగా.... కుటుంబమంతా ఒకే సారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.