Doctor negligence: మనిషికి ప్రాణం పోసేది దేవుడైతే.. ఆ ప్రాణాన్ని నిలబెట్టేది వైద్యుడు. అదే వైద్యుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటే.. దాని ఖరీదు ఓ నిండు ప్రాణం. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్ గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో.. 21 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు.
పాతబస్తీలో నివాసముండే షేక్జునైద్కు మెడపైన(వీపు ప్రాంతంలో) చిన్న కురుపు అయ్యింది. అది కాస్తా రోజురోజుకు పెద్దగా అవుతోంది. ఈ విషయాన్ని జునైద్ తన తండ్రికి చెప్పాడు. డిసెంబర్ 2న జునైద్ తండ్రి... కుమారున్ని తీసుకొని పుప్పాలగూడ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సజ్జాద్ అనే వైద్యునికి తన సమస్యను వివరించాడు జునైద్. పరిశీలించేందుకని జునైద్‌ను వైద్యుడు లోపలికి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత బయటికి వచ్చిన వైద్యుడు.. చెక్ చేసే సమయంలో మెడలో సూది విరిగిపోయిందని జునైద్ తండ్రికి వివరించాడు. విరిగిపోయిన సూదిని తీసేందుకు తమ వద్ద సరైన సదుపాయాలు లేవని.. వెంటనే టోలిచౌకీలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించాడు.
జునైద్‌ను హుటాహుటిన డాక్టర్ చెప్పిన ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు సత్వరమే స్పందించారు. గంటసేపు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వైద్యులు.. సూది తొలిగించామని, మరికాసేపట్లో అబ్బాయి స్పృహలోకి వస్తాడని సినిమా స్టైల్లో జునైద్ తండ్రికి చెప్పారు. గోటితో పోయేది గొడ్డలి దాక వచ్చిందని తీవ్ర ఆందోళన పడుతున్న తల్లిదండ్రులు.. జునైద్‌ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచిచూస్తున్నారు. ఎంత సేపు ఎదురుచూసినా.. డాక్టర్లు పిలవట్లేదు. సుమారు రెండు గంటలైనా జునైద్‌ని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకురాకపోవడం వల్ల అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. నేరుగా లోపలికి వెళ్లారు. ఆపరేషన్ థియేటర్లో తమ కుమారున్ని చూసి హతాశులయ్యారు. చిన్న కురుపయ్యిందని చెప్పిన కుమారుడు విగతజీవిగా మారటాన్ని చూసి ఆ తల్లిదండ్రులకు గుండెలు జారిపోయాయి. గొంతులో నుంచి వస్తున్న దుఃఖాన్ని ఆపి.. ఇదేంటని ఆ తండ్రి ప్రశ్నిస్తే.. అప్పుడు "మీ అబ్బాయి మృతి చెందాడు" అని వైద్యులు వెల్లడించారు.
చేతికి అందివచ్చిన కొడుకును పోగొట్టుకున్న బాధలో ఏమి చేయలో తెలియక.. బరువైన గుండెలతో.. జునైద్ మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు. మూడో తేదీన సెవెన్ టోంబ్స్ వద్ద వారి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కానిచ్చారు. కుమారునికి చిన్న కురుపైతే తట్టుకోలేక.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన తండ్రి.. అదే కుమారుడు ఇకలేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయాడు. చివరకు ఆ బాధ నుంచి కాస్త తేరుకొని.. ఈరోజు(డిసెంబర్ 9)న గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో డాక్టర్ సజ్జాద్, తన కొడుకు మృతికి కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని సమాధిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. విచారణ అనంతరం సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: