హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే.. మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 4 రోజుల క్రితం మొఘల్‌పురాలో 11 ఏళ్ల బాలిక అపహరణకు గురైంది. గత నెల 31వ తేదీన బాలిక ఒంటరిగా తన బంధువుల ఇంటికి వెళ్తుండగా.... తాను కూడా అటే వెళ్తున్నానని మాయమాటలు చెప్పి క్యాబ్ డ్రైవర్ లుక్మాన్ తన కారులో ఎక్కించుకున్నాడు. స్నేహితుడితో కలిసి బాలికను కిడ్నాప్ చేశాడు. బాలికను రంగారెడ్డి జిల్లా కొందుర్గు అనే గ్రామానికి తీసుకెళ్లాడు.
మూడో తేదీ ఉదయం మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్ షాహిలో బాలికను వదిలి పారిపోయాడు. 4 రోజుల నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబీకులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ సాగుతున్న సమయంలోనే బాలిక కనిపించడంతో వివరాలు ఆరా తీశారు. వెంటనే రంగంలోకి దిగిన మొఘల్‌పురా పోలీసులు.. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా క్యాబ్ డ్రైవర్ లుక్మాన్, అతడి స్నేహితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు ఆశ్రయం కల్పించిన వారి వివరాల గురించి కూపీ లాగుతున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి..