హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై గంజాయి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని(Ganja Smuggling) నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం..
ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు, విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లాలోని పలుప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వరకు గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్రంలోని నారాయణఖేడ్, ఆదిలాబాద్, నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ గంజాయి సాగు చేసి సరఫరా చేస్తున్నారు. తనిఖీల వేళ ఎలాంటి అనుమానం రాకుండా వాహనాల్లో పలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడ మీదుగా హైదరాబాద్ చేరుకుని బాహ్యవలయ రహదారి మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి వాహనాలు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. గత పదిహేను రోజుల నుంచి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి విక్రయిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు.
యువత భవిష్యత్ కోసం అవగాహన కార్యక్రమాలు...
మరోవైపు మాదకద్రవ్యాల వాడకంపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్, గంజాయి కొనుగోలు చేస్తూ పట్టుబటిన వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నారు. యువత మత్తు ఉచ్చులో చిక్కుకుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం ఇంట్లో పిల్లలపై చెడుదారుల్లో వెళ్లకుండా పర్యవేక్షించాలని అవగాహన కల్పిస్తున్నారు.
డ్రగ్స్, గంజాయి, గుట్కాలాంటి మత్తుపదార్థాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీసులు మాదకద్రవ్యాల రహిత రాష్ట్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు. మత్తు విక్రయాల గురించి తెలిస్తే 949061711కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తమకు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచటంతో పాటు పోలీసుశాఖ తరఫున నజరానాలు సైతం అందించనున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: CP Mahesh Bhagwat: 'మరో లోకం'తో మత్తును చిత్తు చేస్తాం: సీపీ మహేశ్ భగవత్