హనుమకొండ జిల్లా దర్గాకాజీపేటకు చెందిన గూటం స్వరూపరాణి(57) చూపు కోల్పోయిన వ్యక్తిని వివాహం చేసుకుని అతడికి సేవలు చేసింది. వీరికి సంతానం లేకపోవడంతో అనాథ బాలికను దత్తత తీసుకున్నారు. 12 ఏళ్ల కిందట భర్త అనారోగ్యంతో చనిపోవడంతో పళ్ల వ్యాపారం చేస్తూ దత్తత తీసుకున్న అమ్మాయిని పెంచి పెద్ద చేసింది. ఆమె చదువులు, తన ఆరోగ్యం కోసం మహిళా సంఘాల వద్ద రూ.2 లక్షల అప్పు చేశారు.
ఇంత కష్టపడి.. ఎన్నో అడ్డంకుల మధ్య పెంచిన కూతురు ఇటీవల ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. అప్పు తీర్చే మార్గం కనిపించక కిడ్నీ అమ్ముకుంటానని.. ఏదైనా మార్గం ఉంటే చూడమని ఈనాడు- ఈటీవీ భారత్ ప్రతినిధితో కన్నీటిపర్యంతమైంది. ప్రాణానికి ప్రమాదమని చెబితే.. ‘నా ప్రాణం పోయినా ఫర్వాలేదు.. నా కిడ్నీతో మరొకరు బతకాలి... అలాగే నా అప్పు తీరాలి.. ఇచ్చినవారు రోజూ అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రపంచమంతా సంబురాలు జరుపుకుంటున్న వేళ.. ఓ మహిళామూర్తి బాధ అందరినీ కదిలించేలా ఉంది. మహిళా సాధికారత దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నవేళ.. వాటిని అందిపుచ్చుకుని సొంత కాళ్ల మీద ఆ మహిళను విధి ఎంత పరీక్షిస్తే.. తాను ఈ నిర్ణయం తీసుకుంటుందో అర్థమవుతోంది.
ఇదీ చూడండి: