పూలు కోసిన కాసేపటికే వాడిపోతాయి. వాడిపోయిన పూలను వ్యర్థంగా భావించి తీసి పారేస్తాం. కానీ పూలన్నింటితో పరిమళభరితమైన ధూప్ స్టిక్కులు తయారు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు ఓరుగల్లు వనితలు. వరంగల్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, నగరపాలక సంస్థ ద్వారా శిక్షణ పొందిన పొదుపు సంఘాల మహిళలు.. వరంగల్ మట్టెవాడ జీడబ్ల్యూఎంసీ సామాజిక భవనంలో ధూప్ కడ్డీలు తయారు చేస్తున్నారు.
ధూప్ స్టిక్కుల తయారీ
ఆలయాలు, ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో వాడిన పూలను తీసుకువచ్చి వాటిని నాలుగైదు రోజులు ఎండబెట్టి.. ప్రత్యేక యంత్రంలో పిండిగా చేసి చందనం, ఇతర సుగంధ పరిమళాలు కలిపి ధూప్ స్టిక్కులు తయారుచేస్తున్నారు. వీటిని భద్రకాళీ ఫ్లవర్ ప్రొడక్ట్స్ పేరుతో విక్రయిస్తున్నారు. ధూప్ స్టిక్కులే కాకుండా స్వస్తిక్, ఓం వంటి ఇతర అలంకరణ వస్తువులను కూడా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు.
రసాయనరహిత ఉత్పత్తులు
బీడీలు తయారు చేసే మహిళలు ఆ పని మానేసి ధూప్ స్టిక్కుల తయారీ ప్రారంభించారు. రసాయనాల ద్వారా తయారు చేసే ఉత్పత్తులతో ఆరోగ్యం పాడవుతుందని.. వీటితో ఎలాంటి హామీ ఉండదని వరంగల్ మహిళలు అంటున్నారు.
మార్కెటింగ్‌కు సాయం
కార్తికమాసం కావడం వల్ల తాము తయారు చేసే ధూప్ కడ్డీలు, ఇతర సామగ్రికి డిమాండ్ బాగా ఉందని వరంగల్ మహిళలు తెలిపారు. అందంగా ప్యాకింగ్ చేయడం వల్ల లాభాలు గడిస్తున్నామని చెబుతున్నారు. అధికారులు మరింత మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తే ఆదాయం పెంచుకునేందుకు వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు.
- ఇదీ చూడండి : ఆ దేశంలోని పుష్పాలకు ప్రపంచ సుందరి పేరు '!