తెలంగాణలో నిరాంకుశ పాలనకి, ప్రజాస్వామిక ఆకాంక్షలకు మధ్య ఘర్షణ జరుగుతోందని... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. దీనికి తెరాస విధానాలే కారణమన్నారు. వరంగల్ హన్మకొండలోని నక్కలగుట్టలో... పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. తెలంగాణలో విశ్వద్యాలయాలు పూర్తిగా నాశనమయ్యాయని ఆయన ఆరోపించారు. కనీసం ఒక ఉపకులపతిని కూడా నియమించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చి... తెరాస నాయకులు డబ్బులు దండుకోవడానికి మార్గం సుగమం చేసిందని కోదండరాం ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు... ఘర్షణకు, ఆంకాక్షల వ్యక్తీకరణకు వేదికగా నిలుస్తాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్న పోరాటం ముందుకు తీసుకుపోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు.
ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వారంలోగా నిర్ణయం...