వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల తీరు నగరవాసులకు శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని ఖర్చు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం రాతికోటకు దిగువ ఉన్న ప్రాంతాల అభివృద్ధి కోసం గత ఎమ్మెల్యే కొండా సురేఖ రూ.2.63 కోట్ల నిధులు విడుదల చేశారు. 2017లో ఈ రహదారి నిర్మాణం కోసం భూమిపూజ కూడా చేశారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఖిల్లా వరంగల్ వాసులతో పాటు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అగర్తల నుండి నర్సంపేట ప్రధాన రహదారిని కలుపుతూ సాగే రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నారు. అగర్తల చెరువు నిండి.. వరదనీటి ప్రవాహం వల్ల రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన అప్పటి తెరాస ఎమ్మెల్యే కొండా సురేఖ నిపుణుల సూచనలతో అగర్తల రహదారి నిర్మాణంతో పాటు.. కల్వర్టు నిర్మించేందుకు నిధులు విడుదల చేశారు. అనుకున్నదే తడవుగా పనులను గుత్తేదారులకు అప్పగించినా.. కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లు గడిచినప్పటికీ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు.
వరంగల్ మహానగర పాలక సంస్థలోని అభివృద్ధి పనుల్లో ఎక్కువ కాంట్రాక్టులు ఆయనవే కావడం.. అధికారులకు నిత్యం నజరానాలు అందిస్తుండటం వల్ల వారు నోరు మెదపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు నిర్మించి.. రహదారి పనులు పూర్తి చేస్తే.. ఇటీవలి వర్షాలకు సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, శివనగర్ ప్రాంతాలు నీట మునిగేవి కాదంటున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలంలోని వసంతపురం, స్తంభంపల్లి తదితర గ్రామాలకు ఈ రహదారి అత్యంత కీలకం. ఖమ్మం, వరంగల్, నర్సంపేట రహదారులకు ఈ రోడ్డును లింక్ రోడ్డుగా ఉపయోగిస్తారు. వరద నీటి ప్రవాహానికి ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం వల్ల వరంగల్ నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన అగర్తల అభివృద్ధితోపాటు ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారు లైసెన్సు రద్దు చేసి.. మరొకరికి పనులను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రెండు ఎమ్మెల్సీ స్థానాలపై తెరాస గురి.. పార్టీ శ్రేణుల సమాయత్తం