గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి15కల్లా ప్రస్తుత పాలకవర్గం గడువు పూర్తవుతుంది. కీలకమైన వార్డుల పునర్విభజన చేపట్టాలని... రాష్ట్ర ఎన్నికల సంఘం... ఇప్పటికే పురపాలకశాఖకు లేఖ రాసింది. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడం వల్ల పార్టీ కార్యాలయాలు నేతలు, కార్యకర్తలతో కళకళలాడుతున్నాయి. ఇప్పటి నుంచే నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ.... శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. తెరాస, భాజపా, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోరు నెలకొంది.
విజయమే ధ్యేయంగా తెరాస
ఇటీవల దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార తెరాసకు మిశ్రమ ఫలితాలు రావడం వల్ల ఆ పార్టీ వరంగల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు... క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పలుమార్లు అధికారులతో నగరాభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో వివిధ పనులకు 127కోట్ల నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. పెండింగ్ పనుల పూర్తిపై దృష్టి సారిస్తూనే... నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలూ నిర్వహిస్తూ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.
పట్టుదలతో భాజపా
దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న భాజపా... వరంగల్‌లోనూ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్ పీఠంపై కాషాయ జెండా ఎగురేయాలని పట్టుదలగా ఉన్న కమలదళం.. ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్ ఎన్నికల ఇంఛార్జిగా నియమితులైన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి... నగరంలో శక్తి కేంద్రాల ప్రముఖ్ల సమావేశం నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేశారు. రేపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగర పర్యటన ఖరారు కావడం వల్ల సాధ్యమైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చేందుకు జిల్లా నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అటు తెరాసకు చెందిన 37వ డివిజన్ కార్పొరేటర్ సాంబయ్య ఆ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు.
పోరాడుతున్న కాంగ్రెస్
మరోవైపు వరుస ఓటములతో విలవిల్లాడుతున్న కాంగ్రెస్... గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వవైభవాన్ని సాధించాలనే పట్టుదల ప్రదర్శిస్తోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసిస్తూ... ఆ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ జిల్లాకు రావడం వల్ల కార్యకర్తల్లో కదలిక వచ్చినట్లైంది. పార్టీలో అంతర్గత సమస్యలు త్వరగా సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం, వామపక్షాలు సైతం వచ్చే వారం, పది రోజుల్లో తమ కార్యాచరణను మొదలుపెట్టే అవకాశముంది. సంక్రాంతి తర్వాత గ్రేటర్ ఎన్నికల హడావిడి మరింత పెరగనుంది.
ఇదీ చదవండి: 'సంక్షోభంలో వ్యవసాయం.. కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యం'