Mother protest against son's fraud in Mahabubabad : బ్యాంకు రుణం పేరిట డబ్బు తీసుకుని కొడుకు మోసం చేశాడంటూ ఓ తల్లి అసాధారణ రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌లో మంగళవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సిగ్నల్ కాలనీకి చెందిన కడారి సరోజిని రాణి తొర్రూరు ప్రభుత్వ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు రామకృష్ణ, శ్రీనివాస్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె శ్రీదేవి ఉన్నారు.
రెండు నెలల కిందట సరోజిని ప్రమాదవశాత్తు కిందపడగా కుడి కాలు విరిగింది. కుమారులు 15 రోజుల చొప్పున సపర్యలు చేసేలా పెద్దమనుషుల సమక్షంలో తీర్మానించారు. పెద్ద కుమారుడు రామకృష్ణ, అతని భార్య శిరీష, అత్త కొప్పుల పుష్ప తనను ఆసుపత్రికి తీసుకెళ్తామని నమ్మించి బ్యాంకులో రూ.12.40 లక్షలు రుణం తీసుకున్నారని సరోజిని ఆరోపించారు. ఆ డబ్బు తిరిగి ఇప్పించాలంటూ శిరోముండనం చేయించుకుని పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయమై బాధితురాలి కుమారుడు రామకృష్ణను వివరణ కోరగా తల్లి అనుమతితోనే ఆ డబ్బు తీసుకున్నామన్నారు. 3 నెలల్లో రూ.6లక్షలు ఇస్తానని, మిగతా మొత్తం తమ్ముడికి ఇస్తామని పెద్దమనుషుల సమక్షంలో అంగీకరించినట్లు తెలిపారు.