ప్రధాని మోదీ ఒంటెద్దు పోకడలు పోతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు చేశారని ఆరోపించారు. రైతులకు నష్టం కలిగించే చట్టాలు ఉపసంహరించుకునే వరకు భాజపాపై పోరాడుతామన్నారు. విదేశాల నుంచి మొక్కజొన్న దిగుమతికి అనుమతి ఇవ్వడం వల్ల తెలంగాణ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8 తలపెట్టిన భారత్ బంద్కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించి విజయవంతం చేయాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రైతుబంధు ఇస్తున్నామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను అభివృద్ధి చేసి... రైతులకు సాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. ముఖ్యమంత్రి కృషి వల్ల కరవు జిల్లాలు కూడా సశ్యశ్యామలం అవుతున్నాయన్నారు. కొత్త చట్టాల వల్ల రాష్ట్రంలోని మార్కెట్లు, ఎఫ్సీఐ కూడా మూతపడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం.. భవిష్యత్తుపై దిశానిర్దేశం