గ్రేటర్ వరంగల్‌లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అభినందలు తెలిపారు. భాజపా నేతల మాటలను పట్టించుకోకుండా... వరంగల్ నగర ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కొనియాడారు. ఈ విజయం కార్పొరేటర్లపైన బాధ్యత పెంచిందని... ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. కరోనా కట్టడికి కార్పొరేటర్లు కృషి చేయాలన్నారు. మేయర్ ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్ణయమే శిరోధార్యమంటూ... చేసిన తీర్మానానికి కార్పొరేటర్లు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
కార్పొరేషన్‌కి నిధులు పుష్కలంగా ఉన్నాయని... అభివృద్ధి పనులు చేసి నూతన కార్పొరేటర్లు మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.